కేంద్రం నుంచి రాష్ట్రాలకు రెండు పద్దుల రూపంలో ఆర్థిక ఆసరా అందుతుంది. అందులో మొదటిది పన్నుల్లో రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన వాటా.
రెండోది వివిధ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్. తెలంగాణ పట్ల కేంద్రం ఈ రెండింటిలోనూ వివక్ష చూపుతున్నది.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకుపైగా అందుతుందని తెలంగాణ అంచనా వేయగా.. దానిని కేంద్రం రూ.12 వేల కోట్లకు కుదించింది. అందులోనూ రూ.11,750 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇక గ్రాంట్-ఇన్-ఎయిడ్ పరిస్థితి మరింత దారుణం.
రూ.41,001 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా.. కేంద్రం విదిల్చింది కేవలం రూ.13,087 కోట్లే. బడ్జెట్ అంచనాల్లో ఇది కేవలం 31 శాతమే.
Grant in aid | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రగతికి కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అడుగడుగునా మోకాలడ్డుతున్నది. వయస్సులోనూ, విస్తీర్ణంలోనూ తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో అగ్రగామిగా అవతరించడం కేంద్రానికి నచ్చడంలేదు. అభివృద్ధిలో తెలంగాణ అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరడం, బీజేపీ పాలిత రాష్ర్టాలకు అందనంత ఎత్తుకు ఎదగడం మోదీకి కంటగింపుగా మారింది. అందుకే తెలంగాణ ఆర్థికాభివృద్ధిని ఎలాగైనా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. దేశానికి ఆర్థికంగా తెలంగాణ దన్నుగా నిలుస్తున్నప్పటికీ రాష్ర్టాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని మోదీ సర్కారు చూస్తున్నది.
తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నది. అర్థం పర్థంలేని కొర్రీలతో అవస్థలు పెడుతున్నది. చివరికి పన్నుల వాటాల్లోనూ కోతలు విధిస్తున్నది. ఇక గ్రాంట్-ఇన్-ఎయిడ్ పరిస్థితి మరింత దయనీయం. తొమ్మిదేండ్ల నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు అనేకసార్లు ఢిల్లీ పెద్దలకు అర్జీలు పెట్టుకున్నా ఫలితం శూన్యం. తెలంగాణ తన వేదనను ఎంత గట్టిగా వినిపించినా కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న మోదీ సర్కారు.. దేశ ఆర్థిక రంగానికి దన్నుగా నిలుస్తున్న తెలంగాణపై మాత్రం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది.
2022-23లో ఇచ్చింది 31 శాతమే
కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో రూ.41,001 కోట్లు అందుతాయని రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే కోతలు విధిస్తూ వచ్చిన కేంద్రం.. నిరుడు ఏప్రిల్‌లో రూ.189 కోట్లు మాత్రమే ఇచ్చింది. మే నెలలో మరింత తగ్గించి రూ.101 కోట్లే విదిల్చిన కేంద్రం.. అక్టోబర్‌లో రూ.85 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో రూ.3,768 కోట్లు అందించింది. ఇలా 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో కేంద్రం ఇచ్చిన గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూ.13,087 కోట్లు మాత్రమే. ఇది రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో కేవలం 31 శాతానికి సమానం.
తెలంగాణపై ఆది నుంచి వివక్షే
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన మోదీ.. రాష్ట్రంపై ఆది నుంచీ విషం కక్కుతూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాది కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో రూ.21,720 కోట్లు వస్తాయని రాష్ట్రం ఆశించింది. కానీ, ఆ ఆర్థిక సంవత్సరం (2014-15)లో మోదీ సర్కారు ఇచ్చింది కేవలం రూ.6,489 కోట్లే బడ్జెట్ అంచనాల్లో 30% గ్రాంట్-ఇన్-ఎయిడ్‌ను మాత్రమే విదిల్చి చేతులు దులిపేసుకున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో కేవలం రెండుసార్లు (2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో) మాత్రమే తెలంగాణ బడ్జెట్ అంచనాలకు తగ్గట్టుగా గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇచ్చిన కేంద్రం.. మిగిలిన అన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ 35 శాతానికి మించి ఇవ్వలేదు. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమను కురిపిస్తున్న కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం నిధుల్లో పెద్దపీట వేస్తున్నది.
ప్రత్యేకించి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఏటా బడ్జెట్ ప్రతిపాదనలకు మించి గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో రూ.15,982 వేల కోట్లు వస్తాయని గుజరాత్ తన బడ్జెట్లో అంచనా వేయగా.. కేంద్రం మాత్రం ఫిబ్రవరి చివరినాటికే రూ.17,856 కోట్లు అందజేసింది. అంటే ఇది గుజరాత్ బడ్జెట్ ప్రతిపాదనల్లో 112 శాతానికి సమానం. నిరుడు ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాలైన కర్ణాటకకు 81%, హిమాచల్‌ప్రదేశ్‌కు 81%, ఉత్తరాఖండ్‌కు 66%, మహారాష్ట్రకు 64%, మధ్యప్రదేశ్‌కు 59%, త్రిపురకు 58% (బడ్జెట్ అంచనాల్లో) ఇచ్చిన మోదీ సర్కారు.. తెలంగాణకు మాత్రం అరకొర నిధులిచ్చి చేతులు దులిపేసుకున్నది.
Pp