హైదరాబాద్, ఫిబ్రవరి 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డారు. ఈ పరిస్థితిని మార్చాలన్నదే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్దేశమని స్పష్టంచేశారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో అణగారిన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, దీనిని మార్చాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అందుకోసమే కొత్త రాజ్యాంగం కావాలని దేశం ముందు సీఎం కేసీఆర్ తన ఆలోచనను వెల్లడించారని తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీలో మోదీ ఇంటి ముందు మొరగాలని సవాల్ చేశారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌తో కలిసి శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి మారాలని దేశమంతా కోరుకొంటున్నదని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మోదీ సర్కారు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు.
అంబేద్కర్‌ను అవమానించిందే బీజేపీ
దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనటం తప్పెలా అవుతుందని మంత్రి తలసాని ప్రశ్నించారు. అత్యధికంగా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలని, ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా కేంద్రం ఎందుకు పెడచెవిన పెట్టిందని నిలదీశారు. విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన హక్కులు ఎందుకు సాధించలేదని బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు. కేంద్రమంత్రి హోదాలో కిషన్‌రెడ్డి బడ్జెట్లో రాష్ర్టానికి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేదర్ను అవమానించిన వారిని కేంద్ర మంత్రి పదవులతో ఆదరించిన చరిత్ర బీజేపీదని ధ్వజమెత్తారు. అంబేద్కర్ స్ఫూర్తిని కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడో తుంగలో తొక్కాయని అన్నారు. రాజ్యాంగాన్ని అవసరమైనప్పుడు మార్చుకోవచ్చని స్వయంగా అంబేద్కరే పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రధాని మోదీకి, బీజేపీ నేతలకు పబ్లిసిటీ మీదున్న ప్రేమ ప్రగతిపై లేదని విమర్శించారు.
కేసీఆర్‌కు ట్యూషన్ చెప్పే మొనగాడున్నడా?
సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పరిపక్వత గల నాయకుడని మంత్రి తలసాని అన్నారు. అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప పోరాటయోధుడు, మేధావి అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ట్యూషన్ చెప్పే మొనగాడు కాంగ్రెస్, బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. అసాధారణ మేధాశక్తిగల నాయకుడిగా ఈ దేశ దశదిశ మారాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని భావించారని, దీనిపై విస్తృత చర్చ జరగాలని పేర్కొన్నారు. రాష్ర్టాల హక్కులు, మనుషులందరినీ సమాన భావనతో చూసే సమసమాజ స్థాపన జరగాలన్నదే సీఎం కేసీఆర్ కల అని స్పష్టంచేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతలు డ్రామా కంపెనీని తలపిస్తున్నారని ఎద్దేవా చేశారు.