Mana ooru Mana Badi | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ.. ఆధునీకరించిన బడుల ప్రారంభోత్సవానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. దీంతో సకల సౌకర్యాలతో కూడిన మరో వెయ్యికిపైగా బడులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నది. జూన్ 2 నుంచి 23 వరకు 21రోజుల పాటు రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా ‘మన ఊరు మన బడి మన బస్తీ మన బడి’ కార్యక్రమం కింద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బడులను ప్రారంభించనున్నారు.
‘మన ఊరు మనబడి’ మొదటివిడతలో నిరుడు రాష్ట్రవ్యాప్తంగా 9,145 బడులను చేర్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే 700 వరకు ఆధునీకరించిన బడులను ప్రారంభించారు. తాజాగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరో వెయ్యికి పైగా బడులను జూన్లో ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఆయా వివరాలు అందగానే బడులను ప్రారంభించనున్నారు.
బడుల ప్రారంభోత్సవంలో అందరి భాగస్వామ్యం
‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం కింద అధికారులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. మరీ ముఖ్యంగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులోభాగంగా బడులకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను అందజేశారు. డిజిటల్ బోధనకు వీలుగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహకారంతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే 20వేలకు పైగా టీచర్లకు ట్యాబ్లు ఇవ్వనున్నారు. ఇక ఇటీవలే సైన్స్ల్యాబ్ల ఏర్పాటుకు కూడా పచ్చజెండా ఊపారు. 2వేల బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. 1,521 బడుల్లో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు.
నిరుడు సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టగా, ఈ ప్రయోగం విజయవంతమైంది. మొత్తంమీద పాఠశాల విద్య ప్రగతిపథంలో సాగుతున్న నేపథ్యంలో రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలను సద్వినియోగం చేసుకొనే దిశలో పాఠశాల విద్యాశాఖ కసరత్తును ముమ్మరంచేసింది. ఈ ఉత్సవాలను ప్రారంభోత్సవాల పండుగగా నిర్వహించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. మన ఊరు – మన బడిలో చేపట్టిన పాఠశాలలను ప్రారంభిసున్న సందర్భంగా పండుగ వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలకు ఆ శాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేయనున్నారు.
మన ఊరు -మన బడి కార్యక్రమ అమలు తీరు