హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరు కూడా విద్యాశాఖ కిందే పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలో వీరికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదు. ఇదేదో ఒక నెల, రెండు నెలలు కాదు. ప్రతినెలా ఆలస్యంగానే వస్తున్నాయి. ప్రతినెలా 10 నుంచి 20వ తేదీలోపు జీతాలు జమవుతున్నాయి. ఈ 10 రోజుల్లో ఏ తేదీన వేతనాలు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఈ 10 రోజుల్లో కొండకు ఎదురు చూసినట్టు వేతనాల కోసం మాడల్ టీచర్లు ఎదురు చూడాల్సి వస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తున్నామన్న సర్కారు హామీలు ఎండమావిని తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెల జీతం ఇంకా అందనేలేదు. మంగళవారం నాటికి 13వ తేదీ వచ్చినా ప్రభుత్వం ఇంకా జీతాలు ఇవ్వనేలేదు. కనీసం పండుగలకు ముందు అయినా వేతనాలు ఇవ్వడం లేదు. దసరా పండుగ ఉన్న అక్టోబర్ నెలలోనైనా ఒకటో తేదీన వేతనాలివ్వలేదు. 18 రోజుల తర్వాతే ఖాతాల్లో జమచేశారు. ప్రతినెలా ఇదే అనవాయితీ కొనసాగుతుంది. మొత్తంగా ఒకటో తేదీ వేతనం కలగానే మిగిలింది.
15 నెలలుగా ఇదే తంతు
రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 5,500 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రిన్సిపాళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లు ఉన్నారు. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులే. అయినా వీరి పట్ల ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తున్నది. పేరుకు రెగ్యులర్ ఉద్యోగులే అయినా ఇతర రెగ్యులర్ ఉద్యోగులతోపాటు జీతాలు జమ చేయడంలేదు. గత 15 నెలల కాలంలో ఒక్కరోజు కూడా ఒకటో తేదీన వేతనాలు అందలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సకాలంలో వేతనాలు అందక వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక, చెక్‌బౌన్స్ అయి, సిబిల్ సోర్ పడిపోయి అవస్థలు పడుతున్నారు.
010 పద్దు కింద చేర్చాలి
రెగ్యులర్ ఉపాధ్యాయులం అయినా ఇప్పటివరకు మాకు వేతనాలు అందలేదు. ఈ ప్రభుత్వంలో ఇంత వరకు ఒకటో తేదీన వేతనాలు పడనేలేదు. ఈ నెలలో ఇంతవరకు వేతనాలు అందక ఈఎంఐ, ఇతర ఇంటి అవసరాల కోసం ఎప్పటిలాగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 010 పద్దు కింద చేర్చి, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– భూతం యాకమల్లు, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎంఎస్టీఏ