హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ దవాఖానలను తలదన్నేలా రూపుదిద్దుకొంటున్న ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో కూడిన 8 కొత్త మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. క్యాన్సర్ వ్యాధులకు చికిత్స చాలా ఖర్చుతో కూడినది కావడంతో కార్పొరేట్ దవాఖానలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఎంఎన్జే వరప్రదాయినిలా మారింది. చికిత్స కోసం ఇక్కడికి రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. రోజూ ఇక్కడ 500 నుంచి 800 మంది క్యాన్సర్ రోగులు ఓపీ సేవలు, 500 మందికిపైగా ఐపీ సేవలు పొందుతున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఆపరేషన్ థియేటర్లలో రోజూ 3-4 మేజర్ సర్జరీలు, 6-7 మైనర్ సర్జరీలు మాత్రమే జరుగుతున్నాయి. దీంతో ఇతర రోగులు శస్త్రచికిత్స కోసం 2 నుంచి 3 నెలలపాటు నిరీక్షించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసింది. వీటిని వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే రోగులకు నిరీక్షణ తప్పుతుందని, ఎక్కువ మందికి శస్త్రచికిత్సలు చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. రోజూ 10-15 మేజర్ సర్జరీలు, 20-30 మైనర్ సర్జరీలు చేయవచ్చని వివరించారు.
రోబోటిక్ సర్జరీతో త్వరగా రికవరీ
ఓపెన్ సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలతో రోగులు త్వరగా కోలుకుంటారు. అంతే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఆపరేషన్లు చేసేందుకు వీలుంటుంది. రక్తస్రావం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రోగి శరీరంపై గాటు ఉండదు. చిన్న రంధ్రం ద్వారా సర్జరీ చేస్తారు. రోగి వద్ద డాక్టర్కి బదులు రోబో ఉంటుంది. దానికి కొంత దూరంలో వైద్యులు ఉండి మైక్రోస్కోప్ ఆధారంగా కంప్యూటర్ ద్వారా రోబోను ఆపరేట్ చేస్తారు. తద్వారా మనిషి చేతి వేళ్లు వెళ్లేందుకు వీల్లేని ప్రదేశంలో కూడా రోబో సహాయంతో శస్త్రచికిత్స చేయవచ్చు. – డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్
అందుబాటులోకి రానున్న సేవలు