చిలిపిచెడ్, అక్టోబర్ 11 : ఏఎస్సైని వేధించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సై వేధిస్తున్నాడంటూ మెదక్ జిల్లా చిలిపిచెడ్ పోలీస్స్టేషన్లో ఈనెల 9వ తేదీ రాత్రి ఏఎస్సై సుధారాణి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఎమ్మార్పీఎస్, దళిత సంఘం నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర మాదిగ, దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఏఎస్సై సుధారాణి ఆత్మహత్యాయత్నానికి స్థానిక ఎస్సై యాదగిరి కారణమని ఆరోపించారు. పెట్రోలింగ్ విషయంలో టార్గెట్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఏఎస్సై వాపోయినట్టు పేర్కొన్నారు. ఎస్సైపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.