హైదరాబాద్, జూన్ 28 (నమస్తేతెలంగాణ): ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత పీవీ నర్సింహారావుకే దక్కిందని ఎమ్మెల్సీ వాణీదేవి కొనియాడారు. ఆయన చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని పేర్కొన్నారు. ప్రతిక్షణం దేశాభివృద్ధిని కాంక్షించిన మహోన్నత నేత అని కీర్తించారు. ఆదివారం తెలంగాణ భవన్లో పీవీ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, పార్టీ నేతలు దూదిమెట్ల బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్‌గౌడ్, కిశోర్‌గౌడ్, సుమిత్రా ఆనంద్, సుర్వి యాదయ్యగౌడ్, తుంగ బాలు తదితరులతో కలిసి పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పీవీ సేవలను స్మరించుకున్నారు. అనంతరం వాణీదేవి మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పునాదులు వేసిన మహనీయుడు పీవీ అని శ్లాఘించారు.
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ: కేటీఆర్
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.. బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు పీవీ నర్సింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. పీవీ జయంతిని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కేసీఆర్ ప్రభు త్వం పీవీ శతజయంత్యుత్సవాలను ఘ నంగా నిర్వహించి సమున్నతంగా గౌరవించిందని, నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేసిందని గుర్తుచేశారు.