హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. అది జనగర్జన కాదని.. నాయకుల గర్జన అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చెస్తారో చెప్పలేక ముఖ్యమంత్రి కేసీఆర్పై (CM KCR) విమర్శలు చేశారన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy Venkat reddy) బీఆర్ఎస్పై (BRS) అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే కోమటిరెడ్డి బయట తిరుగలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీటీమ్ కాదు.. సీటీమ్ కాదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు వాస్తవాలను కప్పే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ జోడో యాత్రతో (Bharath Jodo Yatra) మంచి గుర్తింపు వచ్చిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారని, అయితే గుజరాత్లో (Gujarath) యాత్ర ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పోడు పట్టాల పంపిణీతో గిరిజనలు సంతోషంగా ఉన్నారని మధు అన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పారు.