వేములవాడ టౌన్/మంథని/కురవి, ఫిబ్రవరి 26 : శివరాత్రి పర్వదినం ఏర్పాట్లలో అధికారులు విఫలం కావడంతో భక్తులు నరకం చూశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి సుమారు 2.50 లక్షల మంది తరలివచ్చారు. కోడెమొక్కు తీర్చుకునేందుకు గంటలతరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అధికారులు కేవలం వీఐపీల సేవలోనే తరించడంతో భక్తులు ఫైర్ అయ్యారు. మంథని గోదావరి తీరంలో పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు నదిలో నీళ్లులేక తీవ్ర ఇబ్బందిపడ్డారు. గోదావరి తీరంలో రాళ్లను దాటుకుంటూ ఇసుకదిబ్బల్లో దాదాపు కిలోమీటర్‌కు పైగా నడిచి పుణ్యస్నానాలు ఆచరించారు. వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని గోదావరి తీరం నిత్యం నిండుకుండలా దర్శనమిచ్చేది.
ఏ పండుగ వచ్చినా భక్తులు మెట్ల వద్దే సంబురంగా పుణ్యస్నానాలు ఆచరించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా నేడు గోదావరి రాళ్లు, ఇసుక దిబ్బలతో దర్శనమిస్తుండడంతో భక్తులు స్నానాలకు ఇబ్బందిపడ్డారు. ‘గోదావరి నదిలో స్నానం చేద్దామని వస్తే నీళ్లు లేకపాయె. స్నానం కోసం గోదావరి శివారుకు నడుచుకుంటూ పోయినం. ఇసుకలో నడుచుకుంటూ పోతే ప్రాణం పోయినట్టు అనిపించింది. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు నీళ్లకు గోస లేకుండె. ఎప్పుడూ నీళ్లుండె. ఏ పండుగ వచ్చినా ఇక్కడికి వచ్చి స్నానం చేసి పోయేటోళ్లం. ఇప్పుడు స్నానానికి రావాలంటే నీళ్లు లేక ఇబ్బందిపడాల్సి వస్తుంది’ అని మంథని మండలం ధర్మారానికి చెందిన ధర్మక్క వాపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్ర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురసరించుకొని చేసిన ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. వీఐపీ క్యూ లైన్ నుంచి లోపలికి వచ్చే సమయంలో ఎంతకీ కదలకపోవడంతో అసహనానికి గురయ్యారు. ఆలయ ఈవో సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్రమత్తమైన అధికారులు ఎమ్మెల్సీ దంపతులను మరో గేటు గుండా స్వామివారి దర్శనం చేయించారు.