హైదరాబాద్ : తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన దుండిగల్ అమరవీరుల స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వంటి అత్యంత పవిత్రమైన రోజున కూడా అమరవీరుల స్థూపాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఉద్యమకారులతో కలిసి స్వయంగా స్థూపాన్ని నీటితో శుభ్రం చేసి అమరవీరులకు పుష్పాంజలి ఘటించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన రోజునే అమరుల స్మారక స్థూపం నిర్లక్ష్యానికి గురికావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా అమరవీరుల స్థూపాన్ని పట్టించుకోకపోతే మరెప్పుడు పట్టించుకుంటారు? తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గౌరవం? అని రాజు ప్రశ్నించారు.
అమరవీరుల స్థూపాల సంరక్షణను విస్మరించడం అంటే కేవలం ఒక నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని అవమాన పరచడమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరవీరుల స్థూపాల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను సాధించిన అమరవీరుల త్యాగాలను మరచిపోయే ప్రభుత్వాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదని శంభీపూర్ రాజు హెచ్చరించారు.