మహబూబాబాద్ : కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ (MLC Sathyavathi Rathod)అన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని (Veerabhadra swamy) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ.. తెలంగాణ ఉన్నన్ని రోజులు రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రజలు మర్చిపోరన్నారు.
ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రైతుల కష్టాలను సీఎం దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. పార్టీలో చేరి కలపై ఉన్న శ్రద్ధ ప్రజలకు అందించే పాలనపై సీఎం రేవంత్‌రెడ్డికి లేదని దుయ్యబట్టారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టిన కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రైతులను తొలగించేందుకు కొర్రీలు పెడుతున్నారన్నారు. ప్రస్తుత నిబంధనలు చూస్తే కనీసం 50 శాతం రైతులకు కూడా రుణమాఫీ కాదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు.
కేసీఆర్‌ను అభాసుపాలు చేయాలనే కుట్ర కోణంతోనే సీఎం రేవంత్‌రెడ్డి కాలం వెల్లదీస్తున్నాడని, సుప్రీం కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. అంగన్వాడీలకు గుర్తింపు తీసుకువచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమన్న విషయాన్ని ఆ శాఖ మంత్రి సీతక్క మర్చిపోవద్దన్నారు. అంగన్వాడీలకు రూ. 13 వేల వేతనం తో పాటు పదవీకాలం ముగిస్తే రూ. 2 లక్షలు ఇవ్వాలనే జీవోను తీసుకువచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ మన్నా రు. ఎన్నికల కోడ్‌తో ఆ జీవో బయటకు రాలేదని, అది కూడా కాంగ్రెస్ చేసినట్లు చెప్పుకోవడం శోచనీయ మన్నారు. అలాగే కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదన్నారు.