మహబూబాబాద్ : ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసింది. ప్రజా పాలన సభలు(Prajapalana meetings) అంతా బోగస్ అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు(MLC Ravinder Rao) మండిపడ్డారు. మహబూబాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పనికి మాలిన సభల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అవుతుందన్నారు. 13 నెలలు గడిచినా రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఆరోపించారు. నాటి సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా పథకాలను అన్ని వర్గాలకు అందించిన గొప్ప నాయకుడని ప్రశంసించారు.
కానీ, నేటి కాంగ్రెస్ పాలకులు పార్టీ ఆధారంగా పథకాలను రూపకల్పన చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని ప్రజలు వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారనన్నారు. ఒక్క పథకాన్ని ఐనా సరిగ్గా అమలు పర్చవా రేవంత్ రెడ్డి అని సూటిగా నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికే సమయం సరిపోవడం లేదు. బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తున్నదని మండిపడ్డారు.