హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్కారు, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలను ప్రభుత్వం నిలిపివేసింది. కార్మికుల డిమాండ్లలో ఆర్థిక పరమైన అంశాలు ఉండటం వల్ల ఎన్నికల అనంతరమే చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. ఈ క్రమంలో సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు హైదరాబాద్‌లోని కార్మికశాఖ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎవరూ చర్చలకు హాజరవ్వలేదు. కోడ్ నేపథ్యంలో చర్చలను వాయిదా వేసినట్టు కార్మికశాఖ జంటనగరాల డిప్యూటీ కమిషనర్ సునీత పేర్కొన్నారు. చర్చలకు తేదీ నిర్ణయించి, మరోసారి పిలుస్తామని తెలిపారు. మార్చి 8వ తేదీవరకు కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ తర్వాతే చర్చలు జరుగుతాయని సమాచారం.
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీరుపై ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీతో చర్చలను వాయిదా వేయడానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుందని ఆర్టీసీ జాక్ ప్రతినిధులు విమర్శించారు. ఎమ్మెల్సీ కోడ్ ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చిందని, 7న తమను చర్చలకు ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. మార్చి 8 వరకు కోడ్ అమల్లో ఉంటుందని కార్మికశాఖ అధికారులు తెలిపారని, దీనిపై న్యాయవాదులతో చర్చించి, 3రోజుల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న, టీఎంయూ అధ్యక్షుడు ఏఆర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ వైస్‌చైర్మన్ ఎం.థామస్‌రెడ్డి, కత్తి యాదయ్య తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.