హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): రైతుబంధు సమితి సభ్యులకు గౌరవ వేతనం, రవాణా సౌకర్యం కల్పించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన శాసనమండలి జీరోఅవర్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సమితిలో 1,60,995 మంది సభ్యులున్నారని, కరోనా కష్టకాలంలో వీరంతా అధికారులతో కలిసి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరిపారని తెలిపారు. పంటల కొనుగోలు కేంద్రాల్లో స్వచ్ఛందంగా సేవలందించడంతోపాటు గ్రామగ్రామాన తిరిగి నియంత్రిత సాగు విధానంపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించారని వివరించారు. సాగు విస్తీర్ణం నమోదు, భూసార పరీక్షా కార్యక్రమమాల్లో అధికారులకు సహాయం చేయడంతోపాటు అధికారులతో కలిసి 2,602 రైతు వేదికల్లో అన్నదాతలకు 16 వేలకుపైగా శిక్షణా తరగతులు నిర్వహించారని చెప్పారు. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ.. రైతుబంధు సమితి సభ్యులకు గౌరవ వేతనం, రవాణ సౌకర్యం కల్పించే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.