హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే ఢిల్లీ వరకు ఉరికిస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇది మహారాష్ట్రనో, కర్ణాటకనో కాదని.. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ అని చెప్పారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చారని, కేసీఆర్ దెబ్బతో ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలు అబ్బా అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈటల రాజేందర్‌కు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఈటల హత్యారాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2018లో కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెంలో తనను కూడా హత్య చేయించేందుకు ఈటల ప్రయత్నించారని మండిపడ్డారు. ఈటల హత్యా రాజకీయాలు మునుగోడులో మరోసారి నిరూపితమయ్యాయని, పలివెలలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్‌ను హత్య చేయాలని చూశారని ఆరోపించారు.
లోపాయికారి ఒప్పందాలతోనే ఈటల గెలుపు: ఎమ్మెల్యే వివేకానంద
కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిచారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌లో బీజేపీ పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీని దేశవ్యాప్తంగా గద్దె దించాలని కమ్యూనిస్టులు టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకున్నారని తెలిపారు. బీజేపీ నేత వివేక్.. విక్స్ బిళ్ల వివేక్‌గా పేరు పెట్టుకుంటే మంచిదని ఎద్దేవాచేశారు. మునుగోడులో కారును పోలిన 6 గుర్తులతో 7 వేల ఓట్లు కోల్పోయామని, ఆ గుర్తులు లేకుంటే టీఆర్ఎస్కు 18వేల వరకు మెజార్టీ వచ్చేదని స్పష్టంచేశారు. దుబ్బాక కేవలం 2 వేల ఓట్లతోనే బీజేపీ గెలిచిందని.. అవి విజయాలేనా అని ప్రశ్నించారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని చెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. మాటకు కట్టుబడి ఉంటారా? అని అడిగారు. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలని సూచించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని బూర నర్సయ్యను చూసి చెప్పవచ్చన్నారు.