హైదరాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ, నవంబర్ 19: నమ్మకద్రోహమే కాంగ్రెస్ నీతి, రీతి అని.. అధికారం దకించుకోవడానికి ఎంతకైనా దిగజారడం ఆ పార్టీకి పరిపాటేనని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ అంబేదర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ధర్నాలో మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. మ్యానిఫెస్టోలో 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమ లు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని వివరించారు.
ఆ హామీని అమలు చేసి తీరుతామని ఈ రెండేండ్లలో నమ్మిస్తూ వచ్చిందని తెలిపారు. తీరా ఇప్పుడు హైకోర్టు సాకు చూపుతూ బీసీలకు ద్రోహం చేసేందుకు నిస్సిగ్గుగా సిద్ధమైందని ధ్వజమెత్తారు. పార్టీపరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని క్యాబినెల్లో నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అభివర్ణించారు. కాంగ్రెస్ చేసిన ఈ ద్రోహాన్ని ప్రతిఘటించకుంటే బీసీలు శాశ్వతంగా ఓటర్లుగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన దుస్థితితోపాటు భవిష్యత్తు తరాలకూ అవమానాలు, అణచివేతలు తప్పవని వివరించారు.
ఈ దుర్మార్గాన్ని ఎదిరించడాని కి బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని పి లుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి హా మీని అమలుపరిచేవరకూ పోరాడాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ గణేశాచారి, బీసీ జేఏసీ చీప్ కోఆర్డినేటర్ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్కుర్మ తదితరులు పాల్గొన్నారు.