హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎగువసభ (శాసనమండలి) పట్ల చిన్నచూపు, చులకనభావం తగదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సంతాపం తెలిపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. పార్లమెంట్ ఎగువ సభకు అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్‌సింగ్‌కు రాష్ట్ర ఎగువసభ సంతాపం ప్రకటించటం సముచితమని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం తన స్వదస్తూరితో సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగలేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా..
గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గారికి..
నిరాడంబరుడు, నిగర్వి, నిజాయితీపరుడు, నిష్కపటుడు, నిష్కళంకుడు, నిశిత పరిశీలకుడు, పరిశోధకుడు అనేక హోదాల్లో భారతదేశానికి విశిష్ట సేవలు అందించి, ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ఆర్థిక ప్రగతి శిలను శిల్పంగా చెక్కి భారత జాతి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాజీ ప్రధాని దివంగత మన్మోహన్సింగ్ గారిని స్మరించి, సగౌరవంగా సంతాపం తెలిపే అవకాశం శాసనమండలికి కలిగించకపోవటం బా ధాకరం, విచారకరం. దేశంలోని ఎగువ సభకు అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మహానుభావుడికి రాష్ట్రంలోని ఎగువ సభ సంతాపం తెలపటం సముచితం. సంస్కారం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏ మాత్రం కాదు. ఇది శాసనమండలి హృదయ వేదనగా పరిగణించాలి. రాష్ట్రంలోని ఎగువసభ పట్ల చిన్నచూపు, చులకనభావం తగదని సూచిస్తూ ఇక ముందు పునరావృతం కాకూడదని ఆశిస్తూ… సెలవు.
– సిరికొండ మధుసూదనాచారి , ప్రతిపక్ష నాయకుడు, శానసమండలి తెలంగాణ రాష్ట్రం