హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని తాకట్టుపెట్టేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. దీనికి సంబంధించిన తనవద్ద నిర్ధిష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందిందన్నారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్లో కుదువపెట్టేలా కుట్ర జరుగుతున్నదని విమర్శించారు.
కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటటన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణం. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
గత 16 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు. తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అభివృద్ధికి వెచ్చించలేదు. తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదు, ఏమీ చేయలేదని విమర్శించారు. గతంలో చేసిన అప్పులకు రూ.80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు.
తాను ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నానని.. లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారని, ఇది 20 శాతం కమీషన్ సర్కార్ అని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి నేరుగా 20 శాతం కమీషన్ తీసుకున్నాని ఆరోపించారు. దాదాపు రూ. 20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లింది. తాను చెప్పింది తప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. ఓ మంత్రి సొంత కంపెనీకి, మేఘా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ చేసిన అభివృద్ధి పనులకు కాదు. వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క మంచి పని కూడా చేయలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు. చెట్లను, ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలు ఆందోళన చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై సీఎం రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన లేకపోవడం దారుణమన్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములను కుదువ పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని చెప్పారు.
Live: Addressing media at Telangana Bhavan https://t.co/gxDWZPUSrH
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 12, 2025