Media point | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి గేర్లను మార్చకుండా కేవలం పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెట్టేందుకే పరిమితం అవుతున్నది. ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున సాయం అందించేది. దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బడ్జెట్లో కనీసం దాని గురించి ప్రస్తావించలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో చోటే లేదు. పేర్లు, చిహ్నాలు మార్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత హామీల అమలుకు కేటాయింపులు చేపట్టడానికి ప్రభుత్వం ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో ఒక నిమిషం కూడా విద్యుత్తు కోత లేకుండేది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో రోజూ 3 నుంచి 4 గంటల పాటు
కరెంటు పోతున్నది.
-కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
ఓట్‌ఆన్ బడ్జెట్ ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. వ్యవసాయానికి రూ.7,085 వేల కోట్లు కోత విధించడంతో రైతాంగం సంక్షోభం ఎదురొంటది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15వేల పంట పెట్టుబడి సాయం ఇస్తామన్నది. బడ్జెట్ అదేం కనిపించలేదు. రుణమాఫీకి నిధులు కేటాయించ లేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల సాయం, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ బడ్జెట్ ప్రస్తావన లేకపోవడం దారుణం.
-నామా నాగేశ్వర్ బీఆర్ పక్ష నేత, ఖమ్మం ఎంపీ
అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నది. సామాన్యులకు తెలియని విషయంలో అబద్ధాలు ఆడి మోసాలు చేస్తామంటే కుదదు. ప్రజలు అన్ని గమనిస్తారు. గ్యారెంటీలకు కేటాయించిన రూ.53 వేల కోట్లలో రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకామే లేదు. వ్యవసాయరంగానికి 7 వేల కోట్లు తగ్గించారు. రైతుభరోసా, రుణమాఫీని ఏ విధంగా అమలు చేస్తుంది? ధాన్యానికి బోనస్ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు.
– మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
గత ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అన్నట్టు ప్రస్తుత సమావేశాలు నడుస్తున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మహిళా సంక్షేమం కోసం కేటాయింపులు, ప్రతిపాదనలు లేవు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రస్తావనే ఈ బడ్జెట్లో లేదు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మేమూ హర్షిస్తున్నాం. అదేసమయంలో ఆ పథకంతో ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు న్యాయం చేయాలి.
– సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి
తెలంగాణ చరిత్ర, సంస్కృతిని అవమానపర్చేలా సీఎం మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తానని నియంత్రృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు. చార్మినార్, కాకతీయతోరణం తెలంగాణ వారసత్వ చిహ్నాలు. వాటిని తొలగిస్తామనడం దారుణం. మన రాజముద్రలో మూడు సింహాలు ఉంటాయి. అయితే వాటినీ తొలగిస్తారా? కేసీఆర్ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసిన చెరువులను మళ్లీ పూడ్చుతారా? తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే తప్పేంటి? దేవతలా ఉండటానికి కిరీటం పెట్టారు. ఎర్రకోటపై ఎందరో కాంగ్రెస్ ప్రధానులు జాతీయ జెండాను ఎగరవేశారు. రాచరిక గుర్తులున్నాయని ప్రధాని ఎర్రకోటపై జెండా ఎగురవేయవద్దా?
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
బడ్జెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు కేవలం రూ.8 వేల కోట్లు కేటాయించడం దారుణం. కుల వృత్తులకు కేటాయింపులు చేయకపోవడం వల్ల అవి కునారిల్లిపోయే పరిస్థితి నెలకొన్నది.
– బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీనే. కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలు కోసం ఏమి చేస్తారో చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎకువ పేజీలు కేటాయించారు. అంకెలు మార్చి, ఆంక్షలు పెట్టీ అన్నదాత నోరు కొట్టేలా ఉంది. రైతుల కోసం వరంగల్‌లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని ఈ బడ్జెట్ చెప్తున్నది. కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. బీసీ డిక్లరేషన్‌ను కూడా చెత్తబుట్టలో వేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు భేషరతు క్షమాపణ చెప్పాలి.
– తాతా మధు, ఎమ్మెల్సీ
బడ్జెట్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికంగా బడ్జెట్ పెంచి చూపించి ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలకూ బడ్జెట్ కేటాయించింది. వాస్తవంగా సాగు చేస్తున్న భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. ధరణికి మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను తీర్చాలి. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచడం సంతోషకరం.
– సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రాజకీయ ప్రసంగంలా ఉంది. ఒక్కసారిగా అన్ని వర్గాలను నిరాశలోకి నెట్టింది. కేసీఆర్ పాలనలో అవినీతిని ఎండగట్టే ప్రసంగంలా మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారా? దీన్నిబట్టే ప్రజల సంక్షేమం కాంగ్రెస్ ప్రణాళిక ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు రూ.20 వేల కోట్లు అవసరం ఉంటే రూ.7 వేల కోట్లే ఎలా కేటాయిస్తారు? 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి.
– మహేశ్వర్‌రెడ్డి, నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సొంత డబ్బా మినహా ఏమీ లేదు. బడ్జెట్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రస్తావన ఎందుకు లేదు? గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ కూడా బీసీలకు చేసిన మోసం చేస్తున్నది. గొల్ల కురుమలకు గొర్లు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. ఈ బడ్జెట్ కేటాయింపులు ఎవరికీ న్యాయం జరిగేలా లేవు.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే
గత ప్రభుత్వం జిమ్మికుల బడ్జెట్ ప్రవేశ పెట్టేది. మా ప్రభుత్వ బడ్జెట్ పారదర్శకంగా ఉన్నది. ప్రత్యేక ప్రణాళికతో మూసీ నది సుందరీకరణ జరుగుతుంది. గురుకుల విద్యార్థులకు శాశ్వత భవనాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆరోగ్యశ్రీకి అధికంగా నిధులు కేటాయించాం. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ చేయబోదు. దళిబంధు స్థానంలో కొత్త పథకాలు తీసుకొస్తాం.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు అధికశాతం నిధులు కేటాయించింది. ఈ బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు, అర్బన్ డెవలప్మెంటుకు, విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. పంచాయతీరాజ్‌కు కేటాయించిన నిధులతో పల్లెలను సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు.
– రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి
గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్లో ఎకువ పేజీలు కేటాయించారు తప్ప ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదు. వ్యవసాయానికి కేవలం రూ.19,746 కోట్లు కేటాయించారు. మరి రైతుభరోసా, రుణమాఫీ, పంటబీమా, రైతుబీమా, వడ్డీ లేని పంటరుణాలు అమలు పరిస్థితేంటి? కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా నీటిమీద రాతలేనా? ఎన్నికల్లో చ్చిన హామీలను మరిచి రైతులకు కాంగ్రెస్ ధోఖా చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ చిత్తు కాగితాలేనని కాంగ్రెస్ బడ్జెట్ చూస్తే అర్థం అవుతుంది. గతంలో దశాబ్దాలుగా ఎన్నికలు నిర్వహించని చరిత్ర కాంగ్రెస్‌ది. ఈ దఫా కూడా అలాగే మోసం చేస్తుందా? ప్రభుత్వ దవాఖానల బలోపేతానికి నిధులు ఎందుకు కేటాయించలేదు.
– కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మైనార్టీలకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. మైనార్టీలకు సరైన నిధులు కేటాయించకపోవడం దారుణం. మైనార్టీలకు కేటాయించిన రూ.2262 కోట్లు మొత్తం బడ్జెట్లో 0.82 శాతం మాత్రమే. మైనార్టీలు బీఆర్ఎస్కు ఓటు వేసినందుకు ఆ వర్గానికి నిధుల కేటాయింపు తగ్గించారు.
– బీఆర్ఎస్ మైనార్టీ నేత సోహెయిల్
ప్రభుత్వం బడ్జెట్లో బీసీలను పూర్తిగా విస్మరించింది. బలహీనవర్గాల సంక్షేమంపట్ల పట్టింపులేనట్టు వ్యవహరించింది. ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లల్లో లక్షకోట్లు కేటాయిస్తామని పేర్కొన్న ప్రభుత్వం కేవలం రూ.8 వేల కోట్లు కేటాయించడం బీసీల పట్ల వివక్షనే. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. బీసీలను నిర్లక్ష్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
-బీసీ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు