నిజామాబాద్ : సమైక్య పాలనలో రూ.400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమను రూ.30వేల కోట్లకు కేసీఆర్ నాయకత్వంలో పెంచుకున్నామని, మరింత పెంచుకునేందుకు తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవితతో గంగపుత్ర సంఘం సభ్యులు భేటీ అయ్యారు. ప్రతి గంగపుత్ర కుటుంబంలో సంతోషం నింపటమే తమ లక్ష్యమని, అందుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. గంగపుత్రుల సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ నాయకులు అళ్లుల నారాయణ, బట్టు సాయిరాం, తోపారం గంగాధర్, బాల గంగాధర్, రమేష్ తో పాటు గంగపుత్ర సంఘానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.