వరంగల్ : రాష్ట్రంలో కులగణన(Caste census) చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం వరంగల్(Warangal)లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. బిహార్‌లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలన్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు అవుతారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పున రుద్ఘాటించారు. ఈ 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్‌కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని పేర్కొన్నారు.
అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం లేదని తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని పేర్కొన్నారు.
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. హక్కుల కోసం పోరాటం చేయాలంటే..తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉందని గుర్తు చేశారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారి చూపామన్నారు.
దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, బీఆర్ఎస్ నాయకులు వీ ప్రకాశ్, సుందర్ రాజు యాదవ్, యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, భారత జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.