MLC Kavitha | గవర్నర్ ప్రసంగంలో కొత్తం ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా ? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో గాంధీ కుటుంబం బాధ్యత తీసుకోవాలన్నారు. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారని.. స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు.
బాధ్యత తీసుకొని గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తావనే లేదని.. అబద్ధాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడుతామన్నారు. రూ.లక్షా50వేల కోట్ల అప్పులు చేసినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీని విస్మరించిందని మండిపడ్డారు.