Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న కవితకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా గులాబీ నేతలు, కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించగా.. పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. పడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. కార్యకర్తల జై తెలంగాణ నినాదాలతో ఎయిర్పోర్ట్ దద్దరిల్లింది.
ఐదునెలల తర్వాత కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, భర్త అనిల్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. కవిత ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ చేరుకొని తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 26న కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ ఉత్తర్వు కాపీలను న్యాయవాదులు తిహార్ జైలు అధికారులకు అందించారు. అనంతరం కవిత జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.