హైదరాబాద్ మే 27 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని కాపాడుకోగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం అవినీతి, అక్రమాలతో సంస్థను అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ.5 వేల కోట్లతో జైపూర్ పవర్ ప్లాంట్ ఫేజ్-2 పనులను ప్రతిపాదించగా, కాంగ్రెస్ సర్కారు దానిని రూ.9 వేల కోట్లకు పెంచి కమీషన్లు దండుకునేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డా రు.
ఎక్స్‌ప్లోజివ్స్ టెండర్లలోనూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, టెండర్లను ఏకంగా మూడు రెట్లకు పెంచారని ఆరోపించారు. సంస్థ డీఎంఎఫ్టీ నిధులను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గాలైన కొడంగల్, మధిరకు తరలించుకుపోయారని విమర్శించారు. 130 ఏండ్ల సంస్థ చరిత్రలో ఇంతటి దుర్మార్గాలను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో 11 ఏరియాల గని కార్మికులతో సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీ ప్రాపకం కోసం సీఎం రేవంత్ పనిచేస్తున్నారని కవిత ఆరోపించా రు. అందుకే లేబర్కోడ్ల గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తానే స్వయంగా గనులు, ఓపెన్‌కాస్ట్‌ల వద్ద ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.
సింగరేణి జాగృతి కో-ఆర్డినేటర్లుగా బెల్లంపల్లి-కిరణ్ ఓరం, శ్రీరాంపూర్-కుర్మ వికాస్, మందమర్రి-ఎస్ భువన్, రామగుండం-1-బొగ్గుల సాయికృష్ణ, రామగుండం-2-కే రత్నాకర్‌రెడ్డి, రామగుండం-3-దాసరి మల్లేశ్, భూపాలపల్లి-నరేశ్ నేత, మణుగూరు-అజ్మీరా అశోక్‌కుమార్, కొత్తగూడెం-వన్నంరెడ్డి వీరనాగేంద్రసాగర్, కార్పొరేట్-వసికర్ల కిరణ్‌కుమార్, ఎస్టీపీపీ పవర్ ప్లాంట్.
-కే రామ్మోహన్‌చారి నియమితులయ్యారు