MLC Kavitha | ఖలీల్‌వాడీ, జూలై 21: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీచేసినా ఓడించి తీరుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శపథం చేశారు. తన కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలకు 24 గంటల్లోగా ఆధారాలు చూపించాలని, లేదంటే తప్పయిందని ఒప్పుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తాతో కలిసి కవిత శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పైసలు ఉన్నవాళ్ల పక్షానే కాంగ్రెస్, బీజేపీ ఉంటాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాత్రం పేదల పక్షాన ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్కు, బీజేపీకి డీఎన్ఏ మ్యాచ్ కాదని తేల్చిచెప్పారు. రైతులు కేసీఆర్ వెంట ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి కడుపు మండుతున్నదని విమర్శించారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ నాయకులు.. పరిశ్రమలకు కూడా మూడు గంటలు సరిపోతుందని చెప్పగలరా? అని ప్రశ్నించారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్థంపర్థం లేని ఆరోపణలతో తమాషాలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ‘అర్వింద్‌కు 24 గంటల సమయం ఇస్తున్న. నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలి. కాయితం పట్టుకురా. లేకపోతే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. నా తండ్రి కేసీఆర్‌ను, అన్న కేటీఆర్‌ను విమర్శించినా రాజకీయాల్లో ఉన్నందుకు సహించాం. ఇప్పుడు నా భర్తపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాల్లో లేని నా భర్త పేరును ఎందుకు తీసుకొస్తున్నారు? అర్వింద్ చౌకబారు రాజకీయాలు మానుకో.. మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎక్కడ పోటీ చేసినా అక్కడకు వచ్చి ఓడిస్తా. మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తా’ అని తేల్చిచెప్పారు. గతంలో పాలించిన పార్టీలు కమీషన్లకు కక్కుర్తి పడేవని, బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో ఏ కుటుంబం డబ్బులు దోచుకున్నదో ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు.
రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని కవిత విమర్శించారు. ‘కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాదు. మూడుగంటలు విద్యుత్తు చాలంటున్నారు. మరోసారి 24 గంటల కరెంట్ ఇస్తామంటారు. అప్పుడే సోనియాగాంధీ దయ్యమంటారు.. అప్పుడే దేవత అని పొగుడుతారు. పావురాల గుట్టలో పావురంలా మాయమై పోయిండని వైఎస్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు వైఎస్ ఉచిత కరెంట్ ఇచ్చిండని అంటున్నారు. రేవంత్‌రెడ్డి మాటలతో రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి ప్రజలకు అర్థమైంది. ధరణిని రద్దుచేసి దళారులను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ధరణితో భూ వివాదాలు సమసిపోయాయి. చిన్నచిన్న సాంకేతిక సమస్యలుంటే ప్రభుత్వం సరిదిద్దుతున్నది. ధరణి మా విధానం, దళారీ కాంగ్రెస్ విధానం. గతంకంటే భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని అనేక సర్వేలు తేల్చాయి’ అని కవిత తెలిపారు.
మణిపూర్ అల్లర్లపై, నిరుద్యోగంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలిచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అని విమర్శించారు. అబద్ధాల మీద సమాజం నడవదని అన్నారు. రైతుబంధు పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎస్సారెస్పీ పునరుద్ధరణ పథకంలో బీజేపీది ఒక్క రూపాయి కూడా లేదని తెలిపారు. ‘జాతీయ రహదారులపై ఎక్కడైనా గుంతలుంటాయా అని అర్వింద్ ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తీసుకొచ్చిండో చెప్పాలి. నాలుగేండ్లుగా ఆయన ఏం చేస్తున్నారు.. గడ్డి పీకుతున్నాడా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.