హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి, అన్ని పరీక్షలు మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను రద్దుచేసి, తిరిగి నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. గ్రూప్-1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె రాసిన ఈ లేఖ ద్వారా గ్రూప్-1లో పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు వ్యక్తంచేస్తున్న అనుమానాలు, సందేహాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్-1 నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల జీవితాలు అగాథంలో పడ్డాయని మండిపడ్డారు.
నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిన విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు. యువత జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడటం ఆక్షేపనీయమని పేర్కొన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్‌టికెట్లను జారీచేయడంతోనే గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు. 21,075 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందని, కానీ ఫలితాలు ప్రకటించే నాటికి అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరిందని, దీంతో అదనంగా ఆ 10 మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందంటూ ప్రశ్నించారు. ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్షకు హాజరయ్యారని తొలుత ప్రకటించిన టీజీపీఎస్సీ, తర్వాత ఆ సంఖ్య 10కి ఎలా చేరిందని నిలదీశారు. పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా, అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయని ప్రశ్నించారు.
గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ వర్సిటీల ప్రొఫెసర్లతో మెయిన్స్ పరీక్షల వాల్యూయేషన్ చేయిస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించిందని, కానీ రిటైర్డ్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన కమిషన్.. ఆ తర్వాత మాట మార్చి, ఒక సెంటర్‌ను పెంచిందని తెలిపారు. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లోనే మెయిన్స్ పరీక్షలకు హాజరైన, రెండు కోచింగ్ సెంటర్లకే చెందిన 71 మంది అభ్యర్థులు గ్రూప్-1 ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో మతలబు ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. అభ్యర్థుల ఆందోళన ధర్మబద్ధంగానే ఉన్నదని హైకోర్టు కూడా గుర్తించిందని, ఆ నియామకాలపై స్టే విధించిందని ఆమె పేర్కొన్నారు.