ఖైరతాబాద్, జూన్ 20: విభజన చట్టం ద్వారా ఏపీకి కేటాయించిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘పోలవరం తెలంగాణపై జలఖడ్గం, ముంపు గోడు’ అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ము ఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏపీలో కలిపిన పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఆ ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని, లేనిపక్షంలో వరద ముంపునకు గురవుతాయని చెప్పారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ముప్పు ఏర్పడిందని, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జాగృతి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేశామ ని, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామని గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్‌డోర్ పాలిటిక్స్ ద్వారా తెలంగాణకు చెందిన ఏడు మం డలాలను తీసుకున్నారని కవిత ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్ సభ్యులుగా నాడు పార్లమెంట్లో తాము గళమెత్తితే, కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు. అప్పడు సీఎంగా ఉన్న కేసీఆర్ బంద్‌కు పిలుపునిచ్చారని గుర్తుచేశా రు. పోలవరం ముంపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి సీఎం రేవంత్ కేంద్రంపై ఒత్తిడి చే యాలని చెప్పారు. ఈ అంశంపై న్యా యపోరాటానికి వెనుకాడబోమని, కోల్పోయిన గ్రామాలను సాధించుకునేంత వరకు విశ్రమించేది లేదని తేల్చిచెప్పారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అవసరం లేకుపోయినా ఏపీలో కలిపారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్ర సీ నేత గోవర్ధన్ అన్నారు. నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాముడికి అన్యాయం చేసిందన్నారు. ఉమ్మడి ఖ మ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రు లు ఐదు గ్రామాల సమస్యలపై స్పందించాలని కోరారు. 25న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే సీఎంల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడాలన్నారు. సమావేశంలో భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు సంపత్, ఐదు గ్రామపంచాయతీల సాధన సమితి ప్రతినిధులు బాలకృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు.