నిజామాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు ఘోరంగా పతనమవుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు శ్రమకు తగిన ఫలితం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు రూ.8 వేలు మాత్రమే ధర వస్తున్నదని, గరిష్ఠంగా రూ.11 వేలు దాటకపోవడం బాధాకరమని అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు శనివారం వచ్చిన కవిత.. పసుపు కుప్పలను సందర్శించారు. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన పసుపు రైతులతో మాట్లాడి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతులతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి పసుపు తీసుకొచ్చిన రైతులు తమ ఇబ్బందులను వివరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
పసుపుబోర్డుతో ఒరిగిందేమీ లేదు..
ఎన్నికలప్పుడు నిజామాబాద్‌కు వచ్చిన బీజేపీ నేతలంతా పసుపునకు రూ.15వేలు ఇస్తామని చెప్పారని కవిత గుర్తుచేశారు. పసుపుబోర్డు ఏర్పాటుపై తూతూ మంత్రంగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ధర పడిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ పసుపుబోర్డుతో ఒరిగిందేమీ లేదని అన్నారు. పార్లమెంట్లో పసుపుబోర్డు బిల్లు పెడితే దేశంలో నాసిరకం పసుపు దిగుమతి ఆగిపోతుందని, తద్వారా మన రైతులు పండించిన పంటకు ధర పెరుగుతుందని చెప్పారు. నిజామాబాద్ మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ అయ్యారని ఆరోపించారు. మొత్తానికి మొత్తం ధరను తగ్గిస్తున్నారని మండిపడ్డారు.
అవగాహన లేని సీఎంతో రాష్ర్టానికి అన్యాయం..
మహబూబ్‌నగర్ సభలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. గోదావరి నుంచి 200 టీఎంసీలు తరలించడానికి ఏపీ ప్రాజెక్టు సిద్ధమైందని, మన దగ్గరి నుంచి 199 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు. అవగాహన లేని ముఖ్యమంత్రితో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదని అన్నారు. బ్యాగుతో దొరికిన రేవంత్‌రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నదని, చంద్రబాబు జుట్టు మోదీ చేతిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. వాళ్లిద్దరూ ఎలా చెప్తే రేవంత్‌రెడ్డి అలా నడుచుకుంటున్నారని విమర్శించారు. ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే కేసీఆర్ వెళ్లి ప్రధానికి ఫిర్యాదు చేశారని, కేసులు కూడా వేశారని గుర్తుచేశారు. నువ్వెందుకు స్పందించడం లేదంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బనకచర్లపై కోర్టులో కేసులు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా కామెంట్ చేయడం, నోరు ఉందని ఎటు పడితే అటు ఒర్రుడే కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం రేవంత్‌రెడ్డికి చాతనైతలేదని మండిపడ్డారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి మారడం లేదని విమర్శించారు.
1న కలెక్టరేట్ ముట్టడి
పసుపునకు రూ.15వేల కనీస మద్ద తు ధర దక్కే వరకూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రూ.12వేలు అమలు జరిగేలా ఉద్యమిస్తామని కవిత వెల్లడించారు. ఎన్నికల సమయంలో రేవంత్, రాహుల్‌గాంధీ స్వయంగా ప సుపు రైతులకు 12వేలు భర్తీ చేసి ఆదుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. ఒక రైతు తన పంటను క్వింటాకు రూ.8 వేలకు అమ్ముకుంటే మిగిలిన 4వేలు బోనస్ రూపంలో రేవంత్ సర్కారు ఇవ్వాల్సి ఉందని అన్నారు. రైతులంతా పోరాటం చేసే సమయం ఆసన్నమైందని మార్చి 1న కలెక్టరేట్ దిగ్బంధనం చేద్దామని కవిత పిలుపునిచ్చారు.