హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): తిరుమల కొండపై ఉన్న హథీరాం మఠంలో తెలుగు పీఠాధిపతులకూ అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు శనివారం కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హథీరాం మఠంలో తెలుగు పీఠాధిపతులకు కాకుండా ఇతర రాష్ర్టాల పీఠాధిపతులకే అవకాశం కల్పిస్తున్నారన్న అంశాన్ని వారు ఆమె దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై టీటీడీ చైర్మన్, పాలకవర్గంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ మేరకు స్పందించిన కవిత.. వెంటనే టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన ఆయన ఈ అంశాన్ని పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కవితకు హామీ ఇచ్చారు.
‘తక్కువ ధరకే వెదురు సరఫరా చేయండి’
తెలంగాణలోని వెదురు వృత్తిదారులకు తక్కవ ధరకే వెదురు బొంగులను సరఫరా చేయాలని ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు శనివారం ఆమె లేఖ రాశారు. ఏపీలో తక్కువ ధరలకు వెదురు బొంగులు సరఫరా చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలోనూ తక్కువ ధరకే వెదురు బొంగులు సరఫరా చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది వెదురు, దాని ఆధారిత వృత్తులపై ఆధారపడి జీవన కొనసాగిస్తున్న కుటుంబాలు ప్రమాదంలో పడుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.