హైదరాబాద్: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆమె కొనియాడారు. శనివారం నిజామాబాద్లో జరిగిన గోసంగి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళితులకు ఇచ్చే అన్ని పథకాలకు గోసంగి కులస్థులకు వర్తింపజేస్తామని చెప్పారు.
దళితబంధు కొందరికే ఇచ్చారనే ఆందోళన వద్దని, విడతల వారీగా అందరికీ వస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయడంలేదని, కేవలం తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. మోదీ అస్తవ్యస్త పాలనా విధానాలవల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాలు పనిచేయాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వమని కవిత చెప్పారు. గాంధీభవన్లో రేవంత్ అనే గాడ్సే దూరిండని, అందుకే బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆమె విమర్శించారు. రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్ తీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యి దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు.