హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిజామాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఐటీ హబ్‌పై అవగాహన కల్పించేందుకు శుక్రవారం నిర్వహించిన వెబినార్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో కంపెనీలు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు భూనిధి (ల్యాండ్‌బ్యాంక్)ని ఏర్పాటుచేయడంతోపాటు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నదని వివరించారు. ఐటీ హబ్‌లో ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాలని కోరారు. నిజామాబాద్ ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఐటీ హబ్ భవనం అన్ని హంగులతో ముస్తాబవుతున్నదని తెలిపారు.
నిజామాబాద్ ఐటీ హబ్ ఏర్పాటుతో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, 4 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా చెప్పారు. జిల్లాకు చెందిన పలువురు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని, ఐటీ హబ్ ఏర్పాటుతో స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ.. నిజామాబాద్ ఐటీ హబ్‌ను 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. అట్లాంటా, న్యూజెర్సీ, డల్లాస్, వాషింగ్టన్ డీసీ, చికాగో నగరాల్లో పర్యటించి నిజామాబాద్ ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరామని.. ఆయా కంపెనీలు త్వరలోనే ఇక్కడకు వస్తాయన్న విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈవో విజయ్ రంగినేని మాట్లాడుతూ.. ఐటీ హబ్‌లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఐటీ సర్వ్ అలయన్స్ ప్రెసిడెంట్ వినయ్ మహాజన్, పలు దేశాలకు చెందిన ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.