హైదరాబాద్, మార్చి 15: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి భాషను తెలంగాణ సమాజమంతా వ్యతిరేకిస్తున్నదని, కాబట్టి తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హుందాగా రాజకీయాలు చేస్తున్నదని, ముఖ్యమంత్రి ప్రయోగించిన భాషను తాము ప్రయోగించలేమని స్పష్టంచేశారు. సభలో సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన అనంతరం శాసనమండలి ఆవరణలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, షేరి సుభాశ్‌రెడ్డి తదితర సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని, ఆ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే బట్టలు ఊడదీసి ఊరేగిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ఇది చీకటి రోజని స్పష్టం చేశారు. సరైన సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
తెలంగాణకే మాయనిమచ్చ: దేశపతి శ్రీనివాస్
తెలంగాణ సమాజానికి మాయని మచ్చగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నా రు. శాసనమండలి ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమసారథి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ఖండిస్తున్నట్టు చెప్పారు.
అసహనంతోనే అనుచిత వ్యాఖ్యలు: కొప్పుల
ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను తట్టుకోలేని సీఎం రేవంత్‌రెడ్డి అసహనంతో కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు అమలుచేయడం చేతగాని ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు.
సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీఎంవి దిగజారుడు రాజకీయాలు
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి .. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం మల్కాజిగిరి, మార్చి 15 : సీఎం రేవంత్‌రెడ్డివి దిగజారుడు రాజకీయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. సీఎం తీరును నిరసిస్తూ శనివారం మల్కాజిగిరి చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆస్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు వెంకన్న, రామచర్ల నర్సింగ్, కార్పొరేటర్ సునీతారాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌ది భాషాదారిద్య్రం :బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
సీఎం రేవంత్‌ది భావదారిద్య్రం, భాషాదారిద్య్రం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన ప్రసంగంలో ప్రభుత్వ పనితీరు గురించి చెప్పాల్సి ఉండగా, అది మరిచి కేవలం కేసీఆర్, ఆయన కుటుంబంపై విమర్శలకే సమయం కేటాయించారని మండిపడ్డారు.