హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసగించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సమాఖ్య సంఘం ప్రతినిధులు హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,000కు కేసీఆర్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పింఛన్ అందించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు, దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్‌ను నాలుగు రెట్లు పెంచడం లాంటి అనేక గొప్ప కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. అయితే, దివ్యాంగులకు రూ.6,000 పింఛన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఏడాది దాటినా అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డబ్ల్యూపీడీ 2016 చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని, దివ్యాంగులకు రిజర్వేషన్లను కూడా సరైన రీతిలో అమలు చేయటం లేదని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, సబ్సిడీ రుణాలు, పింఛన్ల పెంపు వంటి అంశాలపై మండలిలో చర్చించాలని, తెలంగాణ దివ్యాంగుల సమాఖ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు. వారి వెంట శేరిరిలింగంపల్లి బీఆర్ఎస్ నేత చిర్ర రవీందర్‌యాదవ్ ఉన్నారు.
రాష్ట్రంలో లౌకికత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లౌకికవ్యతిరేక శక్తులపై తాము పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. లౌకికత్వాన్ని పరిరక్షించేందుకు కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, భవిష్యత్తులోనూ అదే పంథాలో ముందుకెళ్తారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పలు ప్రాంతాల్లో ఐక్యతకు బీటలువారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ప్రశాంత జీవనానికి విఘాతం కలిగించిందని విమర్శించారు. తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్, క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షుడు సాల్మన్‌రాజ్ నేతృత్వంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో లౌకికతత్వ పరిరక్షణపై రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాలని ఆకాంక్షించారు. బీజేపీ ప్రోత్సహిస్తున్న విద్వేశానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. క్రిస్టియన్లకు బీఆర్ఎస్ రాజకీయంగా చాలా అవకాశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. కవితను కలిసిన వారిలో క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు శామ్ అబ్రహం, జేకబ్, జవహార్ కెన్నెడీ, ఇజ్రెల్, దేవదానం, సాపా శ్రీనివాస్, అరవింద్, మేజర్ ఫిలిప్ రాజ్, హేమా సునీల్ ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో గంగపుత్ర సంఘం నేతలు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు కులగణనపై నివేదిక ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీ మహిళలకు కోటా కల్పించాలని కూడా పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమాలకు తాము మద్దతు ఇస్తున్నామని వివరించారు. ఏ అంశాన్ని తీసుకున్నా ఇప్పటివరకు వెనుకడుగు వేయకుండా పోరాటం చేశామని గుర్తుచేశారు. గతంలో తెలంగాణ జాగృతి చాలా సామాజిక అంశాలపై పోరాటం చేసిందని ఉదహరించారు.