నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavita) విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు( PV Narasimha Rao) చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్ బోర్గాం(పి)లో బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని పీవీ కుమార్తె , ఎమ్మెల్సీ వాణి దేవి (MLC Vanidevi), కుమారుడు ప్రభాకర్ రావు (Prabhakar Rao) తో కలిసి ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆనాడు పీవీ తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు లక్షలాది మంది బిడ్డలకు ఉద్యోగాలు(Employment) వచ్చాయని, కోట్లాది కుటుంబాలు దారిద్య్రరేఖ నుంచి పైకి ఎగబాకాయన్న విషయం భారత దేశం ఎప్పటికీ మరచిపోదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సీఎం కేసీఆర్ (CM KCR) పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు జరిగాయని, పీవీ ఆలోచనా విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెకు తట్టేలా చాటిచెబుతామని పేర్కొన్నారు. ప్రపంచానికి పీవీ స్ఫూర్తిని పంచుతామని అన్నారు.
పీవీ నరసింహా రావు విగ్రహం ఏర్పాటుతో నిజామాబాద్ కు కొత్త కళ వచ్చిందన్నారు. పీవీ 14 భాషల్లో మాట్లాడడం అంటే మామూలు మేధో సంపత్తికాదని కొనియాడారు. పీవీ నరసింహా రావు వంటి నాయకత్వపు లక్షణాలు అందరికీ రావాలని కోరుకుంటున్నానన్నారు. కేంద్రంలో విద్యా శాఖ మంత్రిత్వ శాఖను మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖగా మార్చి అత్యద్భుతమైన కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారని తెలిపారు.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా నవోదయా విద్యాలయాలను, పాఠశాలలను ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, బీఆర్ఎస్ నాయకులు మహేష్ బిగాల , మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హాజరయ్యారు.