హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించి హ్యాట్రిక్ కొడతామని అన్నారు. గురువారం ఆమె బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను వదలిపెట్టేది లేదని, ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడకు వెళ్లి ఓడిస్తానని మరోసారి శపథం చేశారు. ఎంపీగా పోటీ చేయకుండా కోరుట్ల పారిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అర్వింద్ చెప్పుకుంటున్నారని, అయితే తాను మాత్రం ఎకడికీ పారిపోనని, నిజామాబాద్ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
నిజామాబాద్ తన సొంత ఊరని, తన అత్తగారి ఊరని, తాను బతికున్నంత కాలం.. తన కట్టె కాలుడు కూడా నిజామాబాద్‌లో ఉంటుందని ఉద్విగ్నంగా చెప్పారు. నిజామాబాద్ ఐటీ టవర్‌లో ఉద్యోగాల సామర్థ్యం 750 ఉంటే దానిని ప్రారంభించిన రోజే 280 మందికి ఉద్యోగాలు వచ్చాయని, యువతకు కొత్త ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాషిగౌడ్, ఎంపీ అర్వింద్ ఉలిక్కిపడి అకసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ‘నిజామాబాద్ యువతకు ఐటీ ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా? ఎందుకు అంత అకసు? ఎందుకు కండ్లమంట? చదువుకున్న యువత ఎప్పుడూ మీ వెంట జెండాలు పట్టుకొని జై కొట్టుకుంటూ తిరగాలా?’ అని నిలదీశారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ ఏనాడైనా పార్లమెంట్లో ప్రస్తావించారా? అని ప్రశ్నించారు.
పార్లమెంట్లో బండి సంజయ్ దుర్మార్గమైన అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 24 గంటల కరెంటు ఎక్కడ వస్తున్నదని ప్రశ్నించిన బండి సంజయ్‌కు చేతనైతే కరెంటు తీగలు పట్టుకోవాలని, కరెంటు వస్తుందో రావడం లేదో తెలుస్తుందని అన్నారు. నిత్యం అబద్ధాలు మాట్లాడే బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కేసీఆర్ అంటే భయం పట్టుకున్నదని, అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. తమకు ప్రత్యర్థిగా మరో పార్టీ ఎదుగుతుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటవుతాయని ఎద్దేవా చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఒక్కటైన ఫలితంగానే మధుయాషికి డిపాజిట్ గల్లంతు అయిందని ఉదహరించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దగ్గరుండీ బీజేపీకి ఓట్లు వేయించలేదా? అని ప్రశ్నించారు. పార్టీలు, సిద్ధాంతాలను పకనబెట్టి తనపై వ్యక్తిగత ద్వేషంతో రెండు పార్టీలు కలిసి పనిచేశాయని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని
ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. అందులో భాగంగానే భారత ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామక ప్యానల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేకుండా చేస్తున్నదని మండిపడ్డారు. ఈసీ నియామక ప్యానల్ నుంచి సీజేఐని తొలగిస్తే ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్‌తో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంటే పని దొంగ ఎంపీ అర్వింద్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. ఎప్పుడూ ఇతరులకు కీడు చేయాలని ఆలోచించే అర్వింద్‌కు మేలు చేయడం చేతకాదని పేర్కొన్నారు. ఊరు పైరు పంటలతో పచ్చని సిరులతో ఉండాలని కోరుకోవాల్సింది పోయి చెరువు కట్టలు తెగిపోవాలని కోరుకున్న దుర్మార్గుడు అర్వింద్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తమకు ఎన్నటికీ పోటీకాదని అన్నారు. అర్వింద్ ఒల్లు దగ్గరపెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.