స్టేషన్ ఘన్పూర్, ఎప్రిల్ 19: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును రాజకీయాలకు వాడుకోకుండా.. ఆయనపై ప్రేమ ఉంటే నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో 79 మంది లబ్ధిదారులకు రూ.33,03,700 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కడియం శ్రీహరి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డున బీఆర్ఎస్ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే విమర్శిస్తున్న బీజేపీకి.. నిజంగా అంబేద్కర్‌పై ప్రేమ ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి, తెలంగాణ సెక్రటరీయేట్‌కు అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ చేతులు దులుపుకోలేదని, ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దళితుల ఆర్థిక స్వావలంబన కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే సుమారు 40 వేల కుటుంబాలకు దళితబంధు సాయం అందిందని, ఈ సంవత్సరం లక్షా 30వేల కుటుంబాలకు అందుతుందని చెప్పారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని గమనించి కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలని కడియం శ్రీహరి ప్రజలను కోరారు.