హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీలోని ఈ పరిణామాలను తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. తన అనుచరుడి హత్యతో ఆవేదనకు గురైన జీవన్‌రెడ్డి పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, అధిష్ఠానంలోని ఇతర పెద్దలకు లేఖ రాశారు.
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు. దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన మారు గంగారెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడిగా భావించే సంతోష్ కిరాతకంగా హత్య చేయడం కాంగ్రెస్ కార్యకర్తలను ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా సలహాదారు పదవి కూడా ఇచ్చారని పేర్కొన్నారు.