హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): అడవి, చెంచులు వేర్వేరు కాదని, నల్లమల అడవి వారి ఆవాసమని, తల్లి తావు నుంచి గిరిజనులను వేరు చేయవద్దని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాలకులను కోరారు. వేల ఏండ్లుగా అడవిలోనే నివసిస్తున్న చెంచులు వాటిని కాపాడుకున్నారే తప్ప, ఏనాడూ దాన్ని నాశనం చేయలేదని స్పష్టంచేశారు. చెంచులకు, జంతులకు మధ్య మానవాతీత అనుబంధం ఉందని, అది ఈనాటిది కాదని ఆయన ఉద్ఘాటించారు. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మెనపెంటలో గురువారం ఆయన చెంచులతో మమేకమయ్యారు. 12వ శతాబ్దంలో జరిగిన పల్నాటియుద్ధం నేపథ్యంలో చెంచు గిరిజన మానవ జీవిత పార్శ్వాన్ని తడుముతూ సీనియర్ పాత్రికేయుడు వర్ధెల్లి వెంకటేశ్వర్లు ‘కారుకోడి’ నవల రాస్తున్నారు.
ఈ నవలకు కావాల్సిన కథా వస్తువులు సేకరించడానికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ‘నమస్తే తెలంగాణ’ అసోసియేట్ ఎడిటర్ రఘురాములు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ గైడ్‌గా వెళ్లారు. మూడు రోజుల పాటు కుమ్మెనపెంట, చిగుర్లపాడు, కొల్లంపెంటలో తిరిగి చెంచుల భాషా, సంస్కృతి, జీవన విధానంపై సమాచారం సేకరించారు. టీయూడబ్ల్యూజే జాతీయ నాయకుడు భాస్కర్, రాష్ట్ర నాయకుడు చందు నాయక్, మాజీ జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, రంజిత్, రమేశ్, మహేశ్ ఆంజనేయులు సాగర్, మధు సాగర్, కిరణ్ పాల్గొన్నారు.