హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ సంకుచిత దృక్పథం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రేవంత్రెడ్డి సంకుచిత రాజకీయాలకు విద్యార్థులు బలి అవుతున్నారని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల ముందుమాటలో కేసీఆర్ పేరు ఉందని, ఆ పుస్తకాలను వాపస్ తీసుకోవడం ఆయన కురచబుద్ధికి నిదర్శనమని విమర్శించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన కొత్తలో పాత పుస్తకాలను మార్చలేదని, ఏడాది పాటు పాత పుస్తకాలనే పంపిణీ చేశారని గుర్తు చేశారు.
ఆ పుస్తకాల్లో గత సీఎం పేరు ఉన్నదని.. వాటిని చించండి, వాటికి స్టిక్కర్లు వేయండి, కొత్త పేపర్లు అతికించండి అంటూ ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. విడిపోయిన తరువాత ఏపీలో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పాత పుస్తకాలనే వాడారు తప్ప మార్చలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ‘మాకు బేషజాలు లేవని.. అహంకారం లేదని.. మాది ప్రజాపాలన అంటూ నొక్కి వక్కాణిస్తుంటారని, కానీ ప్రతి చిన్న విషయంలో కూడా సంకుచితంగా వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం, పుస్తకాలు మార్చడంపై బేషజాలకు వెళ్లవద్దని దేశపతి సూచించారు.