Dil Raju | హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. దిల్ రాజు తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన నిర్మించిన సినిమాకు ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో కల్లు, మటన్‌కే వైబ్ ఉంటుందన్న దిల్‌రాజు ఇక్కడ సినిమాలు ఎందుకు విడుదల చేయాలి? కల్లు, మటన్ షాపులు పెట్టుకోవాలి అని మండిపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు పెంచి పేద ప్రజల జేబులు లూటీ చేయబోమని చెప్పిన రేవంత్‌రెడ్డి గేమ్ చేంజర్ సినిమాకు మినహాయింపులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
తెలంగాణభవన్‌లో గురువారం మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, మెతుకు ఆనంద్, పార్టీ నాయకులు గజ్జెల నగేశ్, వాసుదేవరెడ్డి, రాకేశ్, రఘురామ్, మహేందర్‌తో కలిసి దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బెనిఫిట్ షోలపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. తెలంగాణ సంస్కృతిపై రేవంత్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఖండిస్తున్నామని చెప్పారు.
తాను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు సినిమాల టికెట్ రేట్ల పెంపు ఉండబోదన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎంతకు అమ్ముడుపోయి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలపై మాట తప్పినట్టే సినిమా టికెట్ల రేట్ల పెంపుపైనా సీఎం మాట తప్పారని విమర్శించారు. సినిమా వాళ్లు ఏమైనా దేశభక్తులా? ఆర్మీలో చేరి దేశానికి సేవ చేశారా? అని అసెంబ్లీలో ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి దిల్‌రాజు సినిమాకు మినహాయింపులు ఇవ్వడం వెనుక లాభాపేక్షమైన ఒప్పందం జరిగిందని ఆరోపించారు. అన్నింటిపై యూటర్న్ తీసుకుంటున్న రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.