హైదరాబాద్, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కనీసం 20 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్లనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ.. రాజగోపాల్‌రెడ్డిని వాడుకొంటున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని చెప్పారు.
శుక్రవారం శాసన మండలిలోని తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మునుగోడులో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, అందుకే ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టే యత్నం చేస్తున్నదని మండిపడ్డారు. గవర్నర్ బీజేపీ నేత కావడంతోనే పలు బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. అసెంబ్లీ, మండలి ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదన్నారు.