హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తనను గెలిపించిన ప్రజలపై, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాలని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాము చర్చకు సిద్ధమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పనులపై బండి సంజయ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్లో భానుప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా బండి కరీంనగర్‌కు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంతో బీజేపీకి సంబంధమే లేదని బండి తడిబట్టలతో యాదాద్రిలో ప్రమాణం చేసిన నాలుగైదు రోజులకే.. బండి అనుచరులే స్వాములకు ఫ్లైట్ టికెట్లు కొనిచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ఎంత దుర్మార్గానికి ఒడిగడుతుందో దేశానికి తెలిసిపోయిందని చెప్పారు. 8 మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించి దేశంలో ఏ సీఎం చేయని సాహసాన్ని కేసీఆర్ చేశారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను తిట్టడం కాకుండా.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. గత ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని, ఈసారీ అదే పునరావృతం అవుతుందని చెప్పారు.