హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లోనే 3వ తరగతి వరకు అంటే ప్రభుత్వ పాఠశాల విద్యకు మంగళం పాడటమేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. నూతన విద్యావిధానం-2020ను అమలుచేస్తున్నారా? అని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లుగా మార్చి కేజీ నుంచి 3వ తరగతి వరకు చదువు చెప్తామని సీఎం చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ తరగతులు లేక తల్లిదండ్రులు, 3-5 ఏండ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు కాకుండా ప్రైవేటు ప్లే స్కూళ్లకు పంపుతున్నారని తెలిపారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గిపోతున్నదని శనివారం ఒక ప్రకటనలో వాపోయారు. ప్రాథమిక పాఠశాలల్లోనే కేజీ తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీ కరించేందుకు కేంద్రం నూతన విద్యావిధానం అమలుచేస్తున్నదని ఆరోపించారు.
‘317 జీవో’ క్యాబినెట్ సబ్‌కమిటీకి కన్సల్టెంట్
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): జీవో 317, జీవో 46పై క్యాబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం కన్సల్టెంట్‌ను నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ వెంకటేశ్వర్రావును కన్సల్టెంట్‌గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో కూడిన కమిటీకి ఆయన సలహాదారుగా వ్యవహరించనున్నారు. సబ్ కమిటీ సోమవారం భేటీ అయ్యే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి.