మహబూబ్‌నగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు ఎమ్మెల్యే రూటే సపరేటు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు ప్రతి సెగ్మెంట్‌కు ఇవ్వాలని డిమాండ్ చేసి సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ కిట్‌ను ప్రభుత్వ దవాఖానల్లో నిషేధించింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే దీన్ని కొనసాగిస్తున్నారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్ హెల్త్ కిట్) పేరుతో ఈనెల 14న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పంపిణీని ప్రారంభించారు. అచ్చం కేసీఆర్ కిట్‌ను పోలిన వస్తువులనే ఇందులో ఉంచి.. కొన్నింటిని తీసి.. మరికొన్ని చేర్చి బాలింతలకు అందజేశారు. ఈ కిట్‌పై సీఎం ఫొటో, ప్రభుత్వం లోగో గానీ లేకపోవడం విశేషం. సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు యెన్నెం పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తన ఫొటో మాత్రమే పెట్టుకుని, పాలమూరు నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఇవ్వాలని నిబంధన పెట్టి పంపిణీ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా రోగుల తాకిడి ఉంటుంది. చాలామంది గర్భిణులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రసవానికి వస్తుంటారు. కేవలం మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అందజేస్తుండటంతో మిగతా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు సైతం గర్భిణులు, బాలింతల బంధువులు తమకూ కిట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిసింది.
ఇది మిగతా ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఇదిలావుండగా ప్రభుత్వ దవాఖాన నుంచి రోగుల పేరు.. ఆధార్ కార్డు అడ్రస్సు అన్ని వివరంగా రాసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు పంపిస్తే.. అక్కడి నుంచి ఈ కిట్లు దవాఖానకు అందజేస్తారు. మొత్తంగా ఎమ్మెల్యే చేపట్టిన వైఎస్సార్ హెల్త్ కిట్ ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతున్నది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా సొంతంగా ఇలా చేయడంపై పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మిగతా ఎమ్మెల్యేలకు ఈ కిట్ షాక్ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లు ఆపేస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద ఇవే కిట్లు కాపీ కొట్టి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.