హైదరాబాద్, జూలై 25 (నమస్తేతెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో దాగుడు మూతలు ఆడుతూ, దొంగ మాటలు చెప్తూ మళ్లీ మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు హామీలిచ్చి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బీసీలకు 42 శాతం కోటాపై బలహీనవర్గాలను తప్పుదోవ పట్టిస్తున్నదని నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి రోజుకో డ్రామా, పూటకో మాటతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. సోనియాగాంధీ ఎదుట తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కేటాయింపుపై కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి చూపడంలేదని ఆక్షేపించారు.
తప్పుల తడకగా కులగణన
కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని, అది దేశానికి రోల్ మోడల్ కాదని, బోగస్ మోడల్ అని వివేకానందగౌడ్ ఎద్దేవా చేశారు. నాడు ఓట్ల కోసం బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. బడ్జెట్లో బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన హామీని బోగస్ చేశారని తూర్పారబట్టారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, నేతన్నల కోసం జగిత్యాల, వరంగల్‌లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డీ క్షమాపణ చెప్పు!
రేవంత్‌రెడ్డికి బీసీలంటే చులకనభావం ఉన్నదని వివేకానందగౌడ్ విమర్శించారు. అందుకే పదేపదే బీసీ నాయకులను అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయనను తూలనాడటాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ‘కష్టపడి పైకి వచ్చిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరిని మంత్రిగా చేశానని చెప్పుకోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌ను ఉద్దేశించి బట్టలు ఉతికే వ్యక్తిని ఎమ్మెల్యేను చేశానని చెప్పుకోవడం దురదృష్టకరం. వారు ముఖ్యమంత్రి రేవంత్ మాదిరిగా బ్యాగులు మోసి, పైరవీలు చేసి పదవులు తెచ్చుకోలేదు’అని మండిపడ్డారు.
దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌పై నిందలు
పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై నిందలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ అన్నారు. నోట్లో తేనెపోసి కళ్లల్లో కారం చల్లిన విధంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తప్పుడు పద్ధతుల్లో ముందుకెళ్తున్నదని విమర్శించారు. నాడు పదవుల కోసం కేటీఆర్ ఎదుట మోకరిల్లిన నగరానికి చెందిన తండ్రీకొడుకులైన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రేవంత్ మెప్పు కోసం కేసీఆర్‌పై వీధికుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌పై అనుచిత విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.