అలంపూర్ చౌరస్తా, జూలై 30 : రేవంత్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం విద్యార్థులు కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్లారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్యతో కలిసి గురుకుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటగది, సరుకులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి గురుకులాల విద్యార్థుల గోస కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు కనీస వసతులు, సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నారు.
పట్టెడన్నం, తాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు పాదయాత్ర చేపడితే పోలీసులు బలవంతంగా వారిని డీసీఎం వాహనంలో స్కూల్‌కు తరలించారని, ఇదేం న్యాయం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని మండిపడ్డారు. పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని, నిత్యం ఉప్పునీరే తాగాల్సి వస్తుందని, టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్తున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీ సుకొచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలాల్లోకి వెళ్లాల్సి వస్తున్నదని చెప్పగా చలించిపోయారు. ‘రెండు చేతులెత్తి మొక్కుతున్నా.. వీరంతా నా పిల్లలు. వారిని కాపాడండి.. అని ఉపాధ్యాయులు, సిబ్బందిని ఎమ్మెల్యే వేడుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గురుకులాల అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు.