మోర్తాడ్, ఏప్రిల్ 25: నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కార్యాలయం కోసం కేటాయించడాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేయడం ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూమిని కేటాయించడానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, కానీ నగరంలో రూ.కోట్ల విలువైన, ఇదివరకే ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన భూమిని అప్పనంగా కొట్టేయడానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని గుర్తించి ప్రతిపాదించామని తెలిపారు.
బస్టాండ్ నిర్మాణం కోసం రూ.20కోట్లు కేటాయింపులు జరిగాయని తెలిపారు. ప్రభుత్వం మారిన తరువాత అదే స్థలాన్ని కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ప్రజలకు అత్యవసరమైన రవాణా సదుపాయాలను పక్కనబెట్టి పార్టీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ వైఖరిని బహిర్గతం చేస్తున్నదని దుయ్యబట్టారు.
జిల్లా కేంద్రంలో బస్టాండ్ కోసం ప్రత్యామ్నాయ స్థలం లేకపోయినా ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని, ఈ కేటాయింపుల వెనుక వాణిజ్య, వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయం పేరు మీద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారం చేయాలని జిల్లా కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఆ స్థలాన్ని ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.