మోర్తాడ్, సెప్టెంబర్ 30: మక్క పంట చేతికి వచ్చినా కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్-అక్లూర్ రోడ్డుపై కిలోమీటర్ మేర మక్కలు ఆరబెట్టుకున్న రైతులను చూసిన ఆయన కొద్దిసేపు ఆగి వారితో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మక్కలు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తక్కువ ధరకే అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆయన ముందు వాపోవడంతో వేముల చలించిపోయారు.
ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే క్వింటాల్‌కు రూ.2,800 ధర వచ్చేదని వేముల అన్నారు. కానీ ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా దళారులు రూ.1,600లకే మక్కలను కొనుగోలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ‘ఒకవైపు వర్షాలతో పంటను ఆరబెట్టేందుకు రైతులు నానాకష్టాలు పడుతున్నరు. మక్కలకు ఫంగస్ వస్తున్నది. ఇటువంటి పంటను కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఈ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది’ అని తెలిపారు. ఇప్పటికైనా మక్కలు క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధరతోపాటు అదనంగా రూ.400 కలిపి రూ.2,800 చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.