హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ముచ్చెమటలు పోయించారు. సర్కార్ చెప్పిన అబద్ధాలపై ఏకిపారేస్తూనే పదేండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతిని కండ్లకు కట్టినట్టు వివరించారు. మంగళవారం రోడ్లు భవనాలు, టూరిజం ఎక్సైజ్ శాఖల పద్దులపై చర్చలో సాధికారిక ఆధారాలు, అంకెలు, లెక్కలు, ఫొటోలతో సహా వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి, కోమటిరెడ్డి పదేపదే అడ్డుతగులుతూ వేములను నిలువరించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. అరుపులు, కేకలు వద్దని, రన్నింగ్ కామెంటరీ చేయవద్దని అధికార పక్షానికి చురకలంటించారు. ఎక్సైజ్ ద్వారా అదనంగా 12 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం దారుణమని, మ్యానిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్‌షాప్‌లను తొలగించాలని పేర్కొన్నారు.
సర్కారు అబద్ధం : రోడ్ల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8,112 కోట్లే ఖర్చుచేసింది. దీంట్లో రూ. 4167 కోట్లు అప్పుతెచ్చింది.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : ఇది పూర్తిగా అవాస్త వం. ప్లాన్‌లో 2014 నుంచి 2024 వరకు రూ. 8,821 కోట్లు, ఆర్డీసీ నుంచి రుణం తీసుకొని రూ.4,167 కోట్ల చొప్పున రూ.12,988 కోట్లు కేవలం రోడ్ల మీద ఖర్చుపెట్టినం. ఇక నాన్ ప్లాన్ రిపేర్లు, కల్వర్టులు, రెన్యువల్స్‌లో రూ. 3,375 కోట్లు నేరుగా బడ్జెట్ నుంచి రూ. 257 కోట్లు డీఎంఎఫ్టీ నుంచి ఖర్చుచేసినం. పదేండ్లలో నాన్ ప్లాన్‌లో మరో రూ. 3632 కోట్లు ఖర్చుచేసినం. ఈ ఒక్క విభాగం నుంచే రూ.16,621 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసినం. రూరల్ రోడ్స్ విభాగంలో రూ.1022 కోట్లు, సీఆర్ఐఎఫ్ ద్వారా రూ. 2519 కోట్లు ఖర్చుపెట్టినం. రూ. 22,180 కోట్లు విడుదల చేసినం. భవనాల నిర్మాణానికి రూ. 2,652 కోట్లు పెట్టి నం. రూ. 20,625 కోట్లు బడ్జెట్ ద్వారానే ఖర్చుచేసినం. రోడ్లు, భవనాల పనులకు 24,832 కోట్లు ఖర్చు చేసినం. ఎన్‌హెచ్‌ల మీద 8 వేల కోట్లు ఖర్చుచేసినం. అన్నీ కలిపితే రూ. 32,832 కోట్లు. అప్పులు రూ.4,167 కోట్లు మాత్రమే.
సర్కారు అబద్ధం : పదేండ్లల్లో ఒక్క గుంత కూడా పూడ్చలేదు. 6,628 రిపేర్లు చేశారు.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : గతంలో డబుల్ రోడ్లు 6,903 కి. మీ మాత్రమే ఉండేవి. బీఆర్ఎస్ పాలనలో 8,439 కి. మీ రోడ్లను సింగి ల్ లేన్ నుంచి డబుల్ లేన్‌కు మార్చినం. 60 ఏండ్లల్లో ఉన్నదానితో పోల్చితే పదేండ్లలోనే అత్యధికంగా రోడ్లు వేసినం. ఫోర్ లేన్ రోడ్లు ఇది వరకు 669 కి. మీ మాత్రమే. మేం కొత్త గా 485 కిలోమీటర్ల ఫోర్‌లేన్ రోడ్లు వేసినం
సర్కారు అబద్ధం : ఎన్‌హెచ్‌లు వేయలేదు.. కొత్త వాటిని పట్టించుకోలేదు.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్: ఇది వరకు 2,511 కి.మీ ఎన్హెచ్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,472 కిలోమీటర్లను అదనంగా చేర్చినం.
సర్కారు అబద్ధం : మీరు భవనాలు కట్టామంటున్నరు. మీరు కట్టుకుంటే మేం ఇండ్లల్లో పెట్టుకున్నమా?
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : 60 ఏండ్లల్లో కట్టింది 32 లక్షల చదరపు ఫీట్లు మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోటి చదరపు ఫీట్ల కొత్త భవనాలు కట్టినం. మొత్తం 1.32 కోట్ల స్వేర్ ఫీట్ల ఆర్అండ్బీ భవనాలున్నయి. సచివాలయం, కమాండ్ కంట్రోల్ రూం, అంబేద్కర్ విగ్రహ సముదాయం, యాదాద్రి ఆల యం, 30 జిల్లాల్లో కలెక్టరేట్లు, 90కిపైగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు కట్టినం.
సర్కారు అబద్ధం : సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ (సీఐఆర్ఎఫ్ ) నుంచి రాష్ర్టానికి రూపాయి కూడా తేలేదు. ఒక్క రోడ్డును కూడా అభివృద్ధి చేయలేదు.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : 2014 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది సీఐఆర్ఎఫ్ నుంచి నిధులు తెచ్చినం. 2014-15లో రూ.51 కోట్లు, 2015-16లో రూ.135 కోట్లు, 2016లో రూ.280 కోట్లు , 2017లో రూ. 249 కోట్లు, 2018లో రూ.279 కోట్లు, 2019-20లో రూ.234 కోట్లు, 2020-21 లో రూ.253 కోట్లు, 2021-22లో రూ.261 కోట్లు, 2022-23లో రూ.275 కోట్లు, 20 23-24లో రూ.345 కోట్ల చొప్పున 2,369 కోట్లను కేంద్రం నుంచి తెచ్చి రూ.2,519 కోట్లు ఖర్చు పెట్టినం. కేంద్రం ఇచ్చినదానికంటే మేం అదనంగా ఖర్చుచేసినం. కాంగ్రెస్ వచ్చాక కేంద్రం నుంచి రూ. 283 కోట్లు తెచ్చి రూ.256 కోట్లే ఖర్చు చేసింది.
సర్కార్ అబద్ధం : సీఐఆర్ఎఫ్ నుంచి మేం రూ.850 కోట్లు తెచ్చినం. పనులు మంజూరయ్యాయి. 50 శాతం పనులు పూర్తయ్యాయి.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : రూ. 850 కోట్లు మంజూరైనట్టు తెలియదు. నేను మంజూరు పనుల గురించి మాట్లాడటం లేదు. 2024- 25లో సీఐఆర్ఎఫ్ నుంచి ఖర్చుచేసింది రూ. 283 కోట్లే. గతంలో సీఆర్ఐఎఫ్ నుంచి రూ.850 కోట్లు తెచ్చినమన్నరు. ఈ రోజేమో మంజూరు చేసినమంటున్నరు. ఇదేం విధానమో? అర్థం కావడంలేదు.
సర్కారు అబద్ధం : ఉప్పల్ ఫ్లైఓవర్ బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే ఆగిపోయింది. 2017 నుంచి పట్టించుకోలేదు.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : ఉప్పల్ ఫ్లై ఓవర్ నేషనల్ హైవే ప్రాజెక్టు. కాంట్రాక్ట్, పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే. 2017లో పట్టించుకోలేదన్నది అబద్ధం. గెజిట్ వచ్చిందే 2017లో. 2018లో పనులు మొదలయ్యి రెండు, మూడు సంవత్సరాలు కొనసాగాయి.
సర్కార్ అబద్ధం : ఉప్పల్ ఫ్లై ఓవర్‌కు ఎస్కో అకౌంట్ ఓపెన్ చేయలేదు.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : నేను మంత్రిగా ఉన్నప్పుడు పనులు స్లోగా నడుస్తున్నాయేందని సమీక్షిస్తే కాంట్రాక్టర్‌కు పనులు చేయడం ఇష్టంలేదని, వచ్చిన డబ్బును వేరే పనులకు మళ్లిస్తున్నట్టు తేలింది. 28 ఏప్రిల్ 2022లో ఎస్కో అకౌంట్ ఓపెన్ చేసినం. అకౌంట్ ఓపెన్ చేసిన డాక్యుమెంట్ ఇదిగో.. (కాపీ సభలో చూపుతూ). మీరు వచ్చి 15 నెలలైంది. మరి పనులు ప్రారంభమైనయా?
సర్కారు అబద్ధం : ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు 2017లో ఆగిపోయింది. బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కేంద్రాన్ని అడగలేదు.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : అసలు ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసిందే కేసీఆర్. ఇప్పుడున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేసీఆర్‌తో కలిసి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లారు. (గడ్కరీని కలిసిన ఫొటోలు చూపిస్తూ) దేశంలో మేమే మొదటిసారిగా భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరిస్తామని చెప్పినం. 2015 నుంచి తిరిగితే 2021 డిసెంబర్లో అలైన్మెంట్ ఖరారు చేశారు. మేం 100 కోట్లు డిపాజిట్ చేసినం. 2017లోనే అంగీకారం తెలిపితే 2017లోనే ఆగిపోయిందనడం అవాస్తవం. 2024, డిసెంబర్ 28న టెండర్లు పిలిచారు. ఆగిపోయాయి. మళ్లీ ఇంత వరకు టెండర్లు పిలవలేదు. ఈ 15 నెలల్లో ఏం చేశారో చెప్పాలి. దక్షిణ భాగానికి మేం ఆలైన్మెంట్ ఖరారు చేసినం. ఆ అలైన్మెంట్ ఎందుకు మారుస్తున్నారో చెప్పాలి. అలైన్‌మెంట్‌కు కేంద్రం ఒప్పుకోకపోతే 15 వేల కోట్ల భారం పడుతది. ఈ బడ్జెట్లో 3 వేల కోట్ల 1500 కోట్లే కేటాయించారు.
సర్కారు అబద్ధం : హ్యామ్‌లో భాగంగా 17 వేల కిలో మీటర్లు పూర్తిచేస్తాం. 28 వేల కోట్లు ఖర్చుచేస్తాం.
ప్రశాంత్‌రెడ్డి కౌంటర్ : బడ్జెట్ కాపీలోనేమో 17 వేల కిలోమీటర్లు హ్యామ్ ద్వారా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కానీ బడ్జెట్ పద్దుల్లోనేమో 12 వేల కిలోమీటర్లు అని ఇచ్చారు. పోనీ 12 వేల కిలోమీటర్లు పూర్తిచేయాలంటే రూ.19,760 కోట్లు కావాలి. ఈ మొత్తానికి ప్రభుత్వ వాటాగా రూ. 7,904 కోట్లు బడ్జెట్ నుంచి ఇవ్వాలి. ఇదిలా ఉంటే మూడేండ్లల్లో ఈ ఏడాది 4,600 కిలోమీటర్లు పూర్తిచేయాలంటే ప్రభుత్వ వాటాగా రూ. 3,029 కోట్లు కేటాయించాలి. కానీ బడ్జెట్ పద్దుల్లో రూ.500 కోట్లే పెట్టారు. ఈ హ్యామ్ మోడల్ ఎవరికోసం? మీరు చెప్పేది ఎలా నమ్మాలి? నా పార్థివదేహంపై జాతీయజెండా కప్పుతారు
ప్రశాంత్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను చనిపోతే నా పార్థివదేహంపై జాతీయజెండా కప్పుతారు. అతి కొద్దిమందికి దక్కే గౌరవాన్ని నేను పొందాను. కేసీఆర్ ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేనయ్యాను. నాలుగేండ్లు మిషన్ భగీరథ వైస్‌చైర్మన్‌గా, ఐదేండ్లు మంత్రిగా పనిచేశాను. భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకున్నాను. ఎవరు కించపరిచినా, నేను వాస్తవాలే మాట్లాడుతా’ అని భావోద్వేగానికి లోనయ్యారు.