హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఒక భూకబ్జాదారుడు.. నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. వీరేశం కుటుంబానికి దొంగనోట్ల వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, బినామీ పేర్లతో వందలాది కోట్ల వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన అరాచక ప్రవర్తన వల్లే నాడు బీఆర్ఎస్ ఆయనకు సభ్యత్వం ఇవ్వలేదని గుర్తుచేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేయడానికి కొంతమంది విప్‌లను, ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ వాడుకొంటున్నారని చెప్పారు.
పట్టించుకోని మంత్రులు, విప్‌లు
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, విప్‌లు ప్రజల కోసం చేసిందే మీ లేదని, రైతుల కష్టాలను తీర్చడం లేదని చిరుమర్తి లింగయ్య దుయ్యబట్టారు. జిల్లా మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ప్ర భుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప, కల్లాల్లో ధాన్యం కొనుగోలు కాక నేటికీ అల్లాడుతున్న రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మెట్రో అప్పులు ప్రజల నెత్తిన..
రేవంత్ సీఎం కాగానే మెట్రో ఫేజ్-2 టెండర్లను రద్దు చేశారని విమర్శించారు. ఎల్అండ్టీ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి మెట్రోను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొన్నారని, రూ.13,500 కోట్ల అప్పును ఇప్పుడు రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేవలం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ప్రజలను, రైతులను పూర్తిగా గాలికొదిలేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.